Friday, August 13, 2010

ప్రేమలో ఓడిపోయారా..?

మీరు ఎవరినైనా మనసారా ప్రేమించారా..? ఆ వ్యక్తే శ్వాసగా జీవించారా..? వారి ప్రేమకై తపించారా..? ఆ ప్రేమను పొందడం కోసం దేనికైనా సిద్ధపడ్డారా..? కానీ ఆ వ్యక్తి మిమ్మల్నీ, మీ ప్రేమనూ తిరస్కరించారా..? అవమానించారా..? లేదా మోసగించారా..? కారణం ఏదైతేనేమి? " నాది ఫెయిల్యూర్ లవ్ స్టోరీ" అని వాపోతున్నారా..? అది తలచుకున్నప్పుడల్లా గుండెల్ని పిండేసినట్లు వుటుందా..? వీటన్నిటికీ మీసమాధానం `అవును' అయితే కనుక మీరే నాకు కావలసింది, మీకోసమే ఈ వ్యాసం. (మిగతావారూ చదవండి. నచ్చితే ఎవరినైనా చదవమని ప్రోత్సహించవచ్చు.)

"ప్రేమకు ఓటమి ఏమిటీ..?" అని చాలామంది మేధావులు ప్రశ్నిస్తుంటారు. అదంతా మనం పట్టించుకోవద్దు. ఎంత మర్చిపోదామనుకున్నా... ఉన్నట్టుండి ఒక బాధా కెరటం మీ మనసును తాకుతుంటుంది కదా.!? దాని శక్తికి తాళలేక మీరు విలవిలలడిపోతుంటారు... ఏమి చెయ్యాలో అర్ధం కాని దైన్యంలో కూరుకు పోతుంటారు... అయితే నన్ను నమ్మండి. ఒక్కసారి మీరు మర్చిపోవాలనుకుంటున్న ఆ గతాన్ని తవ్వి వెలికి తియ్యండి. దాన్ని కప్పి వుంచడానికి మీచుట్టూ మీరు సృస్టించుకున్న ఈ కృత్రిమ ఆనందం అనే దుమ్మును దులపి పారేయండి.

"మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం పొరపాటు కాదా..?" అంటూ మీ ఆలోచనల్ని పక్కదారి పట్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంటాయి, మోసపోకండి. ఆలోచించండి... గుండె లోతుల్లోకి వెళ్లండి... అప్పుడు.., ఆ వ్యక్తి మీ ప్రేమను తిరస్కరించిన క్షణం... ఒక్క నవ్వు.., ఒక్క చూపు.., ఒక్క మాట... ఏదో ఒకటి మీ హృదయంలో పిడిబాకులా గుచ్చుకుని అది పగిలిపోవడానికి కారణం అయ్యి వుండవచ్చు. వొకవేళ అదే కనుక జరగక పోతే... మీ ప్రేమ వరదలా పొంగివుండేది... నిజమైన ఆనందంలో జీవిస్తూ ఉండేవారు...

అదే ఆ క్షణాన్ని మళ్లీ, మళ్లీ గుర్తుకు తెచ్చుకోండి. ఆ నిమిషం మీ గుండెల్లో ఒక అగ్ని పర్వతం పేలి ఉంటుంది... భగ భగ మండి ఉంటుంది... ఆ విస్ఫోటనంలో మీలో ఆవేశం లావాలా పైకి తన్నుకు వచ్చి ఉంటుంది... అదే, సరిగ్గా అదే ఆవేశం నాకు కావలసింది. మీ మంచి తనం అనే ముసుగులో ఎందుకు దాన్ని దాచాలి అనుకుంటుంన్నారు. వద్దు... ఆ ఆవేశాన్ని చల్లార్చకండి. అఖండంగా వెలగనివ్వండి. ఆ వ్యక్తి కోరుకొని ఉంటే వారి కోసం మీరు ఏదైనా సాధించి ఉండేవారు. కానీ అలా జరగలేదే..? మరిచిపోవద్దు... మీ ప్రేమకు జరిగిన ఆ భంగపాటును మర్చిపోవద్దు. నలుగురి ముందూ ప్రేమను సాధించలేని, చేతకాని వారిగా మిమ్మల్ని నిలబెట్టిన ఆ వ్యక్తిని కలలో కూడా మర్చిపోవద్దు. "మీ ప్రేమలో ఇలా ఎందుకు జరిగింది?" అనే ప్రశ్న వద్దు మనకి. ఇప్పుడేమి చెయ్యలో అది మాత్రమే చెప్తున్నాను నేను. మీ ఆవేశాన్ని రగిలించమంటున్నాను. రగిలే ఆవేశంలో మీలోని శక్తులన్నీ మేల్కొంటాయి. అప్పుడు మీరు దేనినైనా దహించగల అగ్ని స్వరూపులవుతారు. ఆ శక్తులన్నిటినీ ఒక చోట కేంద్రీకరించండి. ఇప్పుడు సంకల్పిస్తే ఏదైనా మీరు సాదించగలరు. ఆ సంకల్ప బలాన్ని వృధా పోనివ్వకండి.

"సంకల్పించండి...

నా జీవితాన్ని నేను కోరుకున్నట్లుగా తీర్చి దిద్దుకుంటా నని...

నా కలల లోకం నిర్మిస్తానని...నన్ను నేను ప్రేమిస్తానని...

నా కర్తవ్యాన్ని గుర్తు చేసిన ఆ వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోనని..."

ఒక్క సారి సంకల్పించాకా.., ఆ దిశగా ప్రయత్నించాకా... పాల వంటి మీ మనసులో పడిన ఆ ద్వేషం(విషం) స్థానంలో ప్రేమ(అమృతం) నిండుతుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది.

ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెడతారో అప్పుడే మీ చుట్టూ ఉన్న వారినీ ప్రేమించడం మొదలవుతుంది. ప్రేమంటేనే విజయమని తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను ఆ క్షణంలోనే మీ జీవితాన్ని పాతెయ్యక... క్షణ క్షణం జీవించమని... మీ ఆవేశానికి అడ్డుగా వేసుకున్న ఆనకట్టల్ని త్రవ్వి పారెయ్యమని... అక్కడితో మీ ప్రేమ ఆగిపోకూడదు. ఎన్ని కొండలు ఎదురైనా దారి మళ్లించుకుని ప్రవహించే జీవ నది లాగ మీ ప్రేమ కూడా పొంగిపొర్లాలి. బీడు వారిన ఎన్నో హృదయాలలో అది ప్రేమ పూలను పూయించాలి.

-ఒక ప్రేమికుడు (నేను మాత్రం కాదు)

disclaimer : I liked this post from one of the friend, his intention is to use that fire in right manner and achieve the heights of world but not to use kill & damage any one/ thing.

No comments:

Post a Comment